YS Jagan మదిలో మరో ఆలోచన.. సచివాలయాన్నిమంగళగిరికి తరలించబోతున్నారా?

Chandrababu Naidu హయాంలో వెలగపూడిలో సెక్రటేరియట్ నిర్మించారు. కానీ వచ్చే సందర్శకులకు, ఉద్యోగులకు ఇక్కడ వసతులేవీ లేవు. దీంతో సచివాలయాన్ని మంగళగిరికి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. అమరావతి నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. అమరావతి ప్రాంతం నిర్మాణాలకు అనుకూలం కాదని, ఇక్కడ నిర్మాణాలకు ఖర్చు ఎక్కువని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

దీంతో రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందా? లేదంటే తరలిస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

చంద్రబాబు కలలుగన్నట్టుగా ప్రపంచస్థాయి రాజధాని కాకుండా.. నామమాత్రంగా రాజధానిని అమరావతిలోనే ఉంచుతారని.. వివిధ విభాగాలను మాత్రం వేర్వేరు నగరాలకు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది.

కర్నూలు‌లో హైకోర్టును ఏర్పాటు చేస్తారని టాక్ వినిపిస్తోంది. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని జగన్ సర్కారు చెబుతుండటమే ఈ ప్రచారానికి కారణం.

అందులో భాగంగానే ముందుగా సచివాలయాన్ని వెలగపూడిని తరలిస్తారని ఇటీవల ప్రచారం జోరుగా సాగుతోంది.

చంద్రబాబు హయాంలో 45 ఎకరాల్లో, రూ.200 కోట్లతో సచివాలయ సముదాయాన్ని నిర్మించారు.

కానీ నిర్మాణంలో నాణ్యత విషయమై అనేక అనుమానాలు తలెత్తాయి. గతంలో జగన్ ఛాంబర్‌లోకి వర్షపు నీరు రావడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.

సచివాలయంలో దాదాపు 2500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా గుంటూరు, విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల నుంచి వెలగపూడికి వస్తున్నారు.

దూర ప్రాంతాల నుంచి వెలగపూడికి రావాలంటే ఇబ్బందిగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారట.

అరకొర రవాణా సదుపాయాలు, వసతుల లేమి వారిని ఇబ్బంది పెడుతోందట. కేవలం ఉద్యోగులే కాదు, సందర్శకులు కూడా ఇబ్బంది పడుతున్నారట.

ఒకవేళ ఉద్యోగుల కోసం నివాస సముదాయాలు నిర్మించినప్పటికీ.. పిల్లల చదువు కోసం, ఇతరత్రా అవసరాల కోసం మళ్లీ విజయవాడ, గుంటూరు నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి.

దీంతో వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని తరలిస్తే బాగుంటుందని కోరుతున్నారట. హైవే మీదుండే మంగళగిరి ప్రాంతానికి సచివాలయాన్ని తరలిస్తే బాగుంటుందని సీనియర్ అధికారులు జగన్‌ను కోరారట.

సచివాలయానికి వాస్తు సమస్యలు కూడా ఉండటంతో అన్ని కోణాల్లోనూ దాన్ని తరలించడమే ఉత్తమం అని జగన్ కూడా భావిస్తున్నారట.

అమరావతి పరిధిలోకి వచ్చే మంగళగిరికి సెక్రటేరియట్‌ను మారుస్తారనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికిప్పుడే కాకపోయినా.. కొద్దిరోజుల తర్వాతైనా ఈ విషయంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందట.

మంగళగరిలోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో లేదంటే.. కాజా సమీపంలో నిర్మిస్తోన్న గేటెడ్ కమ్యూనిటీలోకి సచివాలయాన్ని షిఫ్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *