జగన్ సర్కారుకు హైకోర్టులో మరో షాక్.. ఇళ్ల పట్టాలపై కీలక తీర్పు

జగన్ సర్కారుకు హైకోర్టులో మరో షాక్.. ఇళ్ల పట్టాలపై కీలక తీర్పు
ఇళ్ల పట్టాలకు సంబంధించి హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.

వైసీపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో వైసీపీ సర్కార్‌కు మరో పెద్ద షాక్ తగిలినట్టయింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

అలాగే ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఏపీలో ఆగస్టు 15న ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇళ్ల పట్టాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడం, విచారణ ఇంకా కొనసాగుతుండటంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో రాజధాని అమరావతికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలోని పలు వివాదాస్పద భూములు కూడా ఉన్నాయి.

అమరావతి భూములు, ఇతర భూములకు సంబంధించి పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి.

అమరావతిలో భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై అమరావతి రైతులు కోర్టుకు వెళ్లడంతో అక్కడ బ్రేక్ పడింది. హైకోర్టు నిర్ణయంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ సర్కారుకు చుక్కెదురైంది.

ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఇప్పటికి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. మొదట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఇవ్వాలనుకున్నారు.

అయితే, కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆ తర్వాత ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవ్వాలని ప్లాన్ చేయగా, మళ్లీ వాయిదా పడింది. తాజాగా, అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం యోచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *