తమకు చావే శరణ్యమని.. మరణించడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖ రాశారు.

కారుణ్య మరణం కోరుతూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖ
Amaravati రైతులు తమ పోరాటాన్ని తీవ్రం చేశారు.

తమకు చావే శరణ్యమని.. మరణించడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

అమరావతి రైతుల ఆందోళన కీలక మలుపు తిరిగింది. తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖలు రాశారు. రాజధాని అంశంలో మోసపోయామని.. రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ మంచి కార్యం కోసం తాము చేసిన త్యాగాలకు దక్కిన ఫలితమిదని గోడు వెల్లబోసుకున్నారు. తమకు మరణమే శరణ్యమని పేర్కొన్నారు. చనిపోయేందుకు అవకాశం కల్పించాల్సిందిగా రాష్ట్రపతిని విజ్ఞప్తి చేశారు.

‘సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో ఉన్నపళంగా రోడ్డున పడ్డాం. 14 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. మా గోడు వినిపించుకునే వారే లేరు.

పైగా పోలీసులు మాపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్షగట్టింది’ అంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ ప్రభుత్వం తీసుకున్న అవివేక నిర్ణయంతో రాజధానికి భూములు ఇవ్వడానికి రైతులు ఎవరైనా ముందుకొస్తారా అని వారు ప్రశ్నించారు.

‘రాష్ట్ర విభజనతో రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చాం.

అమరావతిని రాజధానిగా చేస్తూ 2014 సెప్టెంబర్‌లో అన్ని పార్టీలూ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించాయి.

ఈ నేపథ్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా మా భూములను రాజధాని కోసం ఆనందంగా అప్పగించాం. మా త్యాగాన్ని అధికార పార్టీ నేతలు హేళన చేస్తున్నారు’ అని రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.

2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అభినందించారని.. అధికారంలోకి వచ్చాక మాటమార్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఖరితో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని తెలిపారు. కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.

పైగా శ్మశానం, ఎడారి అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు హేళన చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలను ప్రశ్నించే వారిపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

సీఎం, కొందరి స్వలాభం కోసమే రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని రైతులు ఆరోపించారు.

రాజధాని తరలిపోతే తాము జీవశ్చవాలుగా మిగిలిపోతామని రాసుకొచ్చారు. ‘ఈ బతుకులు మాకొద్దు.. మరణమే శరణ్యం’ అంటూ కారుణ్య మరణాల కోసం రాష్ట్రపతిని వేడుకున్నారు.

మంగళగిరికి చెందిన రైతు ఆర్‌వీ శ్రీనివాస రావు S/O సాంబయ్య పేరుతో విడుదలైన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *