అమరావతి – కొన్ని వాదనలు, ప్రశ్నలు, నా అభిప్రాయాలు

 1. “ఒక కులం బాగు కోసమే రాజధాని అక్కడ పెట్టారు.”
  రాష్ట్రంలో ప్రజల మీద, వారిలో ఉన్న చైతన్యం మీద అవగాహన లేనివారు అనేమాట ఇది. ఆ ప్రజలు అవకాశాలు అందిపుచ్చుకోవడంలో రాష్ట్రంలో మిగతావారికన్నా ముందుంటారు అనేది ముందుగా గుర్తుంచుకోవాలి. కర్ణాటక, కోయంబత్తూర్, తెలంగాణ, అమెరికా ఇలా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడకి ముందుగా చేరి ఆ అవకాశాన్ని అంది పుచ్చుకునే ఎంట్రప్రెన్యూరిజం వారిలో ఎక్కువ. రాజధాని కుప్పంలో పెట్టినా అక్కడా వీరు ఉండేవారు. కాబట్టి ఇక్కడ రాజధాని పెడితేనే వారు బాగుపడతారు అనేది అసంబద్ధం.
 2. “రాజధాని వచ్చాక ఆ రెండు జిల్లాల వారు బాగా లాభపడ్డారు.” ఈ వాదన ఎంత బలంగా ఉందో అంతే గట్టిగా ఈ రెండు జిల్లాల ప్రజలు నష్టపోయారు. ఇక్కడ డబ్బున్న వర్గం హడావుడి, హైప్ లో జరిగిన లావాదేవీలే కానీ వాస్తవిక దృష్టిలో అంతకు ముందు పదేళ్లలో ఒక క్రమపద్దతిలో జరుగుతున్న అభివృద్ధి ఆగిపోయింది. కేవలం అమరావతిలోనే పెట్టుబడులు పెట్టించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఆ జిల్లాల్లో మిగతా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టనివ్వలేదు. అమరావతి అక్కడ అని ప్రకటించిన కొద్దికాలానికే కొందరికి జరుగుతున్న నష్టం అర్ధం అయింది, మరికొందరు రేపు బాగుంటుంది అని ఆశలో ఉన్నారు అంతే.
 3. “రాజధాని వల్ల తుళ్లూరు ప్రాంత ప్రజలు బాగా లాభపడ్డారు.” ఎక్కడ రాజధాని వచ్చినా అక్కడ భూమి ఉన్నవారు లాభపడటం సహజం. నూజివీడు, మార్టూరు, దొనబండ ఎక్కడ వచ్చినా అక్కడ భూమి ఉన్న కొద్దిమంది లాభపడతారు. ఆ భూమిని కౌలుకు ఇచ్చి ఎక్కడో పట్టణాల్లో నివసించేవారికి ఒక్కసారిగా అధిక ధరలకు అమ్ముకోవటానికి అవకాశం వచ్చిన మాట వాస్తవం. కానీ, ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్న చిన్న రైతులకు, ఆ భూముల్లో పనిచేసుకొని బతుకున్న వేలాదిమందికి నష్టం జరిగింది.
 4. “రాజధాని అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండాలని అక్కడ పెట్టారు.”
  ఇదొక వితండవాదం. అసలు రాజధాని కరెక్ట్ గా మధ్యలో ఉండాలని ఎవరు చెప్పారు? హైదరాబాద్ మనకు సెంటర్లో ఉందనే అభివృద్ధి అయిందా? అయినా ఇదే సెంటర్ అని ఎవరు కొలతలు వేశారు? కేవలం వాస్తు దృష్టితో ఎటువంటి నిపుణుల సలహా తీసుకోకుండా రాజధానిని నిర్ణయించారు అనేది నిజం.
 5. “పెద్ద రాజధాని వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.”
  అసలు అభివృద్ధికి, రాజధానికి ముడిపెట్టి మాట్లాడటమే హాస్యాస్పదం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ మంచి నీటి సౌకర్యం, చక్కటి స్కూళ్ళు, ఆసుపత్రులు, శాంతిభద్రతలు ఇవే ముఖ్యం. ఇక మన రాష్ట్రానికి మణిహారం కోస్తాతీరం. చంద్రబాబుగారు అమరావతి మీద పడ్డ కష్టం వీటి మీద పెట్టి ఉంటే, ఆయన పరిస్థితితో పాటు నేటి రాష్ట్రం తీరే వేరేగా ఉండేది.
 6. “రాజధానికి అది అనువైన ప్రాంతం కాదు.”
  ఇది నూటికి నూరు శాతం నిజం. అక్కడ కొంత ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి కొంతమంది భూములు కొనుక్కొని ఉండవచ్చు కానీ అందుకోసమే రాజధాని అక్కడ ఎంపిక చేశారు అనేది పసలేని వాదన. చంద్రబాబు గారు నిజంగానే ఒక గొప్ప రాజధాని కట్టాలి అనుకున్నారు అనే నమ్ముతున్నా. కానీ అది ఆయన హైదరాబాద్ తనే కట్టాను అనే ఒక భ్రమలో పడి ఇది కూడా అలాగే కట్టెయ్యగలను అని అనుకున్నారు గాని అసలు రాజధాని అంటే ఏమిటి, మన ఆర్ధిక పరిస్థితి ఏమిటి, ఎక్కడ దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించలేకపోయారు. కేవలం రాజధాని అనే హైప్ ప్రజల కోసం క్రియేట్ చేసి ఆ హైప్ లో ఆయనే మోసపోయారు. మామూలుగా కిలోమీటరుకి 2 కోట్ల వరకు రోడ్డు వెయ్యటానికి ఖర్చు అవుతుంది. అదే అమరావతిలో 32 కోట్లు ఖర్చు పెట్టారు అని చదివా. అది లోతట్టు ప్రాంతం అని, ఎక్కడో పక్క రాష్ట్రాల్లో గట్టి వర్షాలు పడితే ఇక్కడ మునిగే ప్రదేశం అని ఈ రోజు కృష్ణమ్మ నిరూపించనవసరం లేదు, గత ప్రభుత్వమే రాజధాని మొత్తాన్ని ఎన్నో మీటర్ల ఎత్తు లేపి కడతామని, వాగుల మీద రెగ్యులేటర్లు కడతామని చెప్పటం ద్వారా అది సరైన ప్రాంతం కాదు అని వారే చెప్పినట్లు అయింది.
 7. “రాజధానిని వేరే చోటకు తరలిస్తారు.”
  ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నిష్ణాతులతో ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అక్కడి భూములు, సౌకర్యాలతో పాటు సామాజిక, ఆర్ధిక విశ్లేషణ చేసి వినుకొండ-మార్టూరు, దొనకొండ, నూజివీడు వంటి చోట్ల రాజధానిని పెట్టండి అని చెప్పటంతో పాటు, రాష్ట్రం మొత్తం మీద రాజధానిని ఫలానా చోట పెట్టవద్దు అని చెప్పారో అక్కడే రాజధానిని పెట్టి, ప్రజల్లో మంచి చెడు ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా దానిని ఒక సెంటిమెంట్ గా మార్చే ప్రయత్నం జరిగింది. దానివలన ఈ రాష్ట్ర భవిష్యత్తుకు తీరని నష్టం జరిగింది. అక్కడ ప్రభుత్వం పెట్టిన ఖర్చుకి అక్కడున్నవి లెక్క వేస్తే ఒక్క ఇటుక కూడా పడలేదు అనటం పెద్ద తప్పుకాదేమో! కానీ ఇప్పుడున్న ఆ తాత్కాలిక బిల్డింగులనే మరో 10 ఏళ్ళు పరిపాలనకు వాడుకొని రాష్ట్రంలో ఇతర అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టాలి. రాజధాని అనేది పరిపాలన సౌలభ్యం కోసమే అని గుర్తెరిగి అంతవరకు సరిచేసుకొని అక్కడే ఉంచటం ఉత్తమం. ఆ ప్రాంతంలో మరేమి కొత్తవాటి మీద ఖర్చు పెట్టకుండా వికేంద్రీకరణ మీద దృష్టి పెట్టాలి.
 8. “మరి సేకరించిన భూమి, ఇతర కాంట్రాక్టులు?”
  ప్రభుత్వం 5000 ఎకరాల వరకు ఉంచుకొని, మిగతా ప్రాంతమంతా జోనింగ్ వేసి రైతులకు తిరిగి ఇచ్చెయ్యాలి. సింగపూర్ కాంట్రాక్టులు, ప్రభుత్వం చేసిన అపార్ట్మెంట్ వ్యాపారం ఇక్కడితో రద్దు కావాలి. ప్రజల భూముల మీద ప్రభుత్వానికి వ్యాపారం చేసే ఆలోచన ఉంటే మానుకోవాలి. గతంలో మాకిచ్చిన హామీ మేరకు అభివృద్ధి చెందలేదు, మా భూములు మాకి తిరిగి ఇవ్వమని రైతులు కోర్టుకెక్కితే, కోర్టులు ఆయా భూయజమానులకు అనువుగా తీర్పులిచ్చిన ఉదాహరణలు దేశంలో ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపైనా ఏ ప్రభుత్వమున్నాజరిగే పనే అది. గత ప్రభుత్వం అక్కడ రాజధాని అని, ఇన్ని వేల ఎకరాలు అని స్టోరీ లైన్ చెప్పిన రోజే అమరావతికి ఇదే క్లైమాక్స్ అని నేను గట్టిగా నమ్మాను. ఆ క్లైమాక్స్ సరైనది, ప్రజలు అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని ఇప్పటికీ నమ్ముతున్నా.

చివరగా ఒక్క మాట, రాజధాని మీద ఇంత చర్చ అనవసరం. దీనికన్నా పోలవరం, వెలుగొండ, హంద్రీ-నీవా, ఉత్తరాంధ్ర అభివృద్ధి, విద్య, వైద్యం వంటి వాటి మీద చర్చలు చెయ్యండి, మీ పిల్లలకు మంచి రాష్ట్రాన్ని ఇచ్చిన వారవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *