800 గదులు, 60 బస్సులు, వచ్చిన వారికి ఆహారం….రూ.80లక్షలు ఖర్చుతో దీల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష…. ఏపీ భవన్‌లో ఏర్పాట్లు

1.ఏపీ భవన్ వేదికగా నిరసనకు దిగనున్న ముఖ్యమంత్రి
2.దిల్లీ చేరుకున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు
3.మద్దతిస్తున్న పలు పార్టీలు, సంఘాలు
4.రాష్ట్రపతితో బాబు భేటీ
తెలుగువారి ఆత్మగౌరవ నినాదం సోమవారం మరోసారి దేశరాజధానిలో హోరెత్తనుంది.
కేంద్రం చూపిస్తున్న వివక్ష, మొండి వైఖరిని ఎండగట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ప్రారంభం కానుంది. వేలాదిగా తరలి వచ్చిన వారి గళంలో ప్రత్యేకహోదా నినాదం హోరెత్తనుంది.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం కోసం దీక్ష చేసిన వేదిక నుంచే మరోసారి చంద్రబాబు దీక్ష ప్రారంభం కానుంది.
గతేడాది తన పుట్టిన రోజునాడు కేంద్రం వైఖరిని నిరసిస్తూ ధర్మపోరాట దీక్ష చేసిన సీఎం చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకొని పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జంతర్‌మంతర్ వేదికగా ఎంపీ మాగంటి బాబులు దిల్లీలో ధర్మపోరాట దీక్షలు చేసిన విషయం విదితమే.
ఎన్డీయే మధ్యంతర బడ్జెట్‌లోనూ ఏపీకి మొండిచెయ్యి చూపడంతో సీఎం చంద్రబాబు ఈ సారి దిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేయాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ సహాపలు జాతీయపార్టీల నేతలు హాజరుకానున్నారు. వేలాదిగా జనం రాష్ట్రం నుంచి తరలి వస్తున్నారు.
పలు పార్టీలు, ఐకాసలు, విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి సంఘాల వారు దిల్లీకి చేరుకున్నారు.
ఏపీ భవన్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వచ్చిన వారికి బస ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు.. ఎలా వెళ్లాలి… తిరిగి వేదిక వద్దకు ఎలా చేరుకోవాలనేది వివరిస్తున్నారు.
ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ అర్జా శ్రీకాంత్, ఏపీఈడీబీ ప్రత్యేక కమిషనర్ భావన సక్సేనా తదితరులు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు.
దీక్షకు వచ్చే వారికి 800 గదులు, 60 బస్సులు, ఆహార ఏర్పాట్లు చేశామన్నారు. ఏపీ భవన్‌లో ఏర్పాట్లకు రూ.80లక్షలు ఖర్చయిందని తెలిపారు.
చంద్రబాబు దీక్ష చేయనున్న వేదిక ఏపీ భవన్‌లో సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రితోపాటు మరో 10 మంది మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.
తెలుగు సంఘాల మద్దతు: ధర్మపోరాట దీక్ష నేపథ్యంలో దిల్లీ తెలుగు అసోసియేషనన్, ఆంధ్ర అసోసియేషన్, తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, ఆదిలీల ఫౌండేషన్, వనిత మండలి తదితర సంస్థల ప్రతినిధులు దీక్షకు మద్దతుగా తరలిరానున్నారు.
ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులు, ఎంపీలు: ఏపీ భవన్ ప్రాంగణంలోని వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రులు జవహర్, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు తదితరులు పర్యవేక్షించారు.
తెదేపాపా నేత సుజనాచౌదరి, ఎంపీలు అశోక్‌గజపతిరాజు, మాగంటి బాబు, మురళీమోహన్, రవీంద్రబాబు, నిమ్మల కిష్టప్ప, కనకమేడల రవీంద్రకుమార్, బుట్టారేణుక, రామ్మోహన్‌నాయుడు.
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావులు అధికారులను అడిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రభుత్వానికి రావాల్సిన అంశాలు కాబట్టి ప్రభుత్వం తరఫున దీక్ష చేస్తున్నారని సుజనాచౌదరి అన్నారు.
మోదీ మరోసారి ప్రధాని అయితే మరో ఐదేళ్లపాటు రాష్ట్రానికి తిప్పలు తప్పవని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
తెలంగాణ యువత దీక్ష: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన ముగ్గురు యువకులు ఉమేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రవితేజరెడ్డిలు ఏపీ భవన్‌లో దీక్ష చేపట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబు దీక్షకు మద్దతుగా తాము ఈ దీక్ష చేపట్టామన్నారు.
రాష్ట్ర మంత్రి జవహర్ వారికి నిమ్మరసం తాగించి వీక్ష విరమింపజేశారు.
కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ప్రభుత్వంచేస్తున్న పోరాటమే ధర్మపోరాట దీక్ష అని తెదేపా అధికారప్రతినిధి సాదినేని యామిని శర్మ అన్నారు.
ఏపీ నుంచి హాజరుకానున్న పార్టీలు, సంఘాలు:

లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ, సమాజ్‌వాదీ, వైఎస్‌ఆర్ ప్రజాపార్టీ, నవతరం పార్టీ, సమత పార్టీ, రివల్యూషన్ సోషలిస్టు పార్టీ, ఇండియన్ ముస్లింలీగ్, ఫార్వడ్ బ్లాక్, నవసమాజం పార్టీ, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్.
ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస, ఏపీ ఐకాస అమరావతి, ప్రైవేటు కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్, విద్య ఐకాస, కంప్యూటర్ టీచర్స్ ఐకాస, ఏపీ సివిల్ సర్వీస్ అసోసియేషన్.
ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక పరిషత్, ఏపీ సచివాలయ అసోసియేషన్, రాయలసీమ బీసీ అసోసియేషన్, హిందూ మహాసభ, రేపటికోసం ట్రస్టు, సినీ పరిశ్రమ, ఏపీ విద్యార్థి ఐకాస, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల సమాఖ్య, ఏపీ బార్ అసోసియేషన్-అడ్వొకేట్ ఐకాస.
ఏపీ బీసీ ఐకాస, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ, ప్రొఫెసర్స్, మేధావుల ఫోరం, తెలుగునాడు విద్యుత్తు కార్మికుల సంఘం, ఏపీయూడబ్ల్యూజే, ఏపీజేఎఫ్, ఏపీ డబ్ల్యూజేఎఫ్, ఏపీఈఎంజేఏ, ఏపీఈఎంవీఏ, ఏపీపీజేఏ, ఏపీజేఎఫ్, పీఆర్‌టీయూ(జే), రైతు కమిటీ, ఏపీ ఎస్‌ఏసీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏయూ విద్యార్థి అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్, స్మాల్, మీడియం న్యూస్ పేపర్స్.
ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్, పీఆర్‌టీయూ, జర్నలిస్టు అసోసియేషన్, విశాలాంధ్ర మహాసభ, ఏపీఎస్ ఆర్టీసీ-ఎన్‌ఎంయూ, ప్రత్యేకహోదా సాధనసమితి, అఖిల భారత పంచాయతీ పరిషత్.