40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. మోదీ సంచలన వ్యాఖ్యలు…


మీ పార్టీలో తిరుగుబాటు వస్తుంది, 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని మోదీ దీదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్‌లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీలిపోనుందా? మమతా బెనర్జీకి బీజేపీ షాకివ్వనుందా? దీదీని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యలను చూస్తే అవుననిపిస్తోంది.

‘దీదీ.. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని విడిచిపెడతారు. టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నార’ని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనమయ్యాయి.

దీదీ పోలీసులను తన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఉండాలని అనుకుంటున్నారని మోదీ విమర్శించారు.

బెంగాల్‌లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందన్న మోదీ.. టీఎంసీ గుండాలు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

టీఎంసీ గుండాలు బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించకుండా అడ్డు తగులుతున్నారు, మా పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని మోదీ ఆరోపణలు గుప్పించారు.

‘దీదీ.. కొన్ని స్థానాల్లో గెలిచినంత మాత్రాన మీరు ఢిల్లీని చేరుకోలేరు. ఢిల్లీ మీకు చాలా దూరంలో ఉంది.

ఆమె అసలు ఉద్దేశం ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం కాదు.. తన మేనల్లుడిని రాజకీయంగా స్థిరపడేలా’ చేయడం అని విమర్శించారు.

ఓడిపోతానని తెలిసే మమత సహనం కోల్పోతున్నారని మోదీ ఎద్దేవా చేశారు.

గతంలో మోదీని మాత్రమే నిందిచేవాళ్లు.. ఇప్పుడు ఈవీఎంలను కూడా నిందిస్తున్నారు. భారీ ఓటమి తప్పదనే భయంతోనే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విపక్షాలపై మోదీ మండిపడ్డారు.

40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలపై టీఎంసీ మండిపడింది. బీజేపీ నాయకులు ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీశారని, ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *