100 రోజుల జగన్ పరుగు – డాక్టర్ విజయ్ కుమార్, ఆంధ్రభూమి

మే 30 న జగన్ ప్రమాణ శ్వీకారానికి అయినా ఖర్చు కేవలం 15 లక్షలు. చంద్రబాబులా 15 కోట్లు వృథా చేయలేదు

2014లో జగన్ పార్టీని స్వల్ప మెజారిటీతో ఓడించారు. అప్పట్నించి ఎన్నో కష్టాలు పడ్డాడు. తెలుగుదేశం వారిచే ఎన్నో పరాభవాలు, అవమానాలు చవిచూశాడు. తన పార్టీ నుండి ఎన్నికైన 23 మంది శాసనసభ్యులు, ముగ్గురు పార్లమెంటు సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గద్దలా తన్నుకుపోయినా మొక్కవోని ధైర్యంతో, సడలని విశ్వాసంతో ముందడుగు వేశాడు.

అన్ని అవమానాలు భరిస్తూనే ఆత్మధైర్యంతో 2017 సం. నవంబర్ 6న ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టాడు. ప్రతి ఒక్కర్ని పలుకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకొంటూ వారి బాధలు పంచుకుంటూ, వాళ్ళతోనే మమేకం అయి, వాళ్ళ ఇళ్ళలోనే సేద తీరుతూ, అప్రతిహతంగా 341 రోజులు పాటు నడిచాడు.

భారతదేశంలో ఇంతవరకూ ఏ నాయకుడు నడవనంత దూరం అంటే 3,643 కి.మీ దూరం నడక సాగించాడు.

‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు‘, ‘బాధాసర్పద్రష్టులారా! దగాపడిన అమ్మలారా.. ఏడవకండి ఏడవకండి.. నేనున్నా నేనున్నా’ అంటూ శ్రీశ్రీగారి కవితల్ని గుర్తుకుతెస్తూ సాగిపోయింది ఆయన పయనం. అందర్నీ కలుసుకొన్నాడు-అన్ని సమస్యలూ తెలుసుకొన్నాడు. మీకు ‘నేనున్నాను’ అన్న గట్టి భరోసా ఇచ్చాడు.

మే 30వ తారీఖు నుండి ముఖ్యమంత్రిగా ఆయన జైత్రయాత్ర ఆరంభమైంది. తన టీమ్‌లోని మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చూపించాడు.

చాలామంది కొత్తవారు, యువరక్తం. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనారిటీ, కాపులకు ప్రాధాన్యత కల్గిస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎమ్‌లు. ఇదో రికార్డు. ఇందులో ఇద్దరు మహిళలు కావడం చాలా గొప్ప విశేషం. మంత్రివర్గంలో 50 శాతం పైగా బడుగు, బలహీన వర్గాలే.

‘వట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టిగా మేలు చేపట్టవోయ్’ – ఇదీ జగన్ వ్యక్తిత్వం.

ఆనాటి నుండి జగన్ పరుగులు చేస్తూనే 100 రోజులు దాటాడు. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్… ఇలా ఎనె్నన్నో చెప్పుకోవచ్చు. మరి జగన్ తద్విరుద్ధంగా పరుగెత్తుతూనే వున్నాడు.

ఏదో తపన, ఏదో ఆతృత, త్వరత్వరగా చేసేయాలన్న భావన ఆయన్ని పరుగెత్తిస్తున్నాయి.

ఏ పార్టీ అయినా తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారానికొచ్చాక ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాలని అనుకొంటారు. అందరూ అన్నీ పూర్తిచేయాలనుకోరు. చేయలేరు కూడా! ఐదుసార్లు అధికారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, అన్నిసార్లు రాజ్యాధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ తామిచ్చిన వాగ్దానాల్ని పూర్తిగా నెరవేర్చలేకపోయాయన్నది చరిత్ర చెప్పే సత్యం.

ప్రమాణ స్వీకార సభలో జగన్ క్లుప్తంగా, చక్కగా అందరికీ ఆనందాన్నిచ్చేలా, ఉత్సాహపరిచేలా మాట్లాడటం ప్రశంసనీయం. అందులో తాను ఈ రాష్ట్రానికి ఏం చేయగలను అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. ఆ సభ నిర్వహణే ఒక కొత్తదనం. కేవలం 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి గతంలో ఎన్నడూ నిర్వహించని విధంగా అత్యంత సింపుల్‌గా నిర్వహించడంతో జగన్ విజయపథం ఆరంభమైంది

సెప్టెంబర్ 6వ తారీఖు ఆయన పాలనకు వంద రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన పాలనపై కాస్త సమీక్షించుకోవడమే ఈ వ్యాస ఉద్దేశం.

వృద్ధుల పెన్షన్ 2000 నుండి 2250 రూపాయలకు పెంచారు. వికలాంగులకు 2000 నుండి 3 వేలకు, కిడ్నీ పేషెంట్లకు 3500 నుండి రూ. 10 వేలకు, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3000లకు, ఆశా వర్కర్లకు 3 వేల నుండి 10వేల రూపాయలకు, ఉద్యోగస్థులకు ఐఆర్ 27 శాతం ప్రకటించారు. ఈ నిర్ణయాలన్నీ జూన్ 2, 3 తేదీలనాడే తీసుకొన్నారు.

జూన్ 4వ తారీఖున చీఫ్ జస్టిస్‌తో సమావేశమై లా కమిషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకొన్నారు. అప్పటినుంచి రోజుకు రెండు మూడు రివ్యూలు జరిపారు.

జూన్ 6వ తేదీన జరిగిన వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ సమీక్షల సందర్భంగా రెండు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఒకటి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, రెండవది 14 సాగునీటి ప్రాజెక్టులపై థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించడం.

జూన్ 13న వెనుకబడిన వర్గాలకు చెందిన తమ్మినేని సీతారాంని స్పీకర్‌గా ఎంపిక చేయడం శుభపరిణామం.

ఆ రోజు ఇంకో గొప్ప పరిణామం ఏమంటే- ఎవరైనా ఎంఎల్‌ఏలు పార్టీ ఫిరాయింపు చేస్తే అనర్హత వేటువేయాలని స్వయంగా జగన్ ప్రకటించడం దేశ రాజకీయ రంగంలో కొత్త శకం ఆరంభం. యావత్ దేశానికే ఆదర్శం.

ఆ సందర్భంగా గతంలో 23 వైసీపీ శాసనసభ్యుల్ని తమ పార్టీలో చేర్చుకున్న నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మొహం మాడిపోవడం అందరూ చూశారు.

24, 25వ తేదీన అమరావతిలో జరిగిన కలెక్టర్లు, పోలీసు ఆఫీసర్ల కాన్ఫరెన్స్‌లో జగన్ తమ ప్రభుత్వ ఆశయాలు, ఆశలు, నవరత్నాలగూర్చి స్పష్టమైన దిశను నిర్దేశించారు. కులం, మతం, వర్గం, పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి ఒక్కరి గడపకు చేరాలని ఆదేశించడం బహు ప్రశంసనీయం, ఆదర్శనీయం కూడా! ప్రతి రాజకీయ నాయకుడు కూడా జగన్ దగ్గర ఈ గుణం నేర్చుకోవాల్సిందే.

పార్టీలు, వర్గాలు ఎన్నికలకే పరిమితంకావాలి. ఎన్నికలైపోయాక ప్రభుత్వానికి అందరూ సమానమే.

‘నాకు ఓట్లు వేయలేదు, మీకు నేనెందుకు చేయాలి’ అని చంద్రబాబులా వ్యవహరించకూడదు.

అలాగే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కూడా సఖ్యతగా వుండడం చాలా అవసరం. ముఖ్యంగా తెలుగువారు దురదృష్టం కొద్దీ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా పరస్పర సహకారంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం ఎంతైనా అవసరం. ఆ పరమార్థాన్ని అంత చిన్న వయసులోనే ఎంతో గ్రహించిన జగన్, తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ని ఆహ్వానించారు. అలాగే 21వ తేదీన తెలంగాణలో నిర్మించిన అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరయ్యారు. ఇరు రాష్ట్ర సమస్యలపై, గోదావరి జలాలపై రెండు మూడుసార్లు అన్నదమ్ముల్లా కలిసి చర్చించుకొన్నారు. ఇది ఇరు రాష్ట్రాలకు శుభపరిణామం.

దీనిపై కూడా కొందరు మూర్ఖులు, తెలివితక్కువ దద్దమ్మలు జగన్ రాష్ట్రాన్ని కేసీఆర్‌కి దోచిపెడుతున్నారని కువిమర్శలు కూడా చేశారు. ఒకరికొకరు వెన్నుపోట్లు పొడుచుకోకుండా ఇలా సఖ్యతగా వుండడం ఎంతో మంచిది!

అధికారానికొచ్చాక చంద్రబాబు కూడా కేసీఆర్‌తో సఖ్యత నటించి ఓటుకు నోటు ద్వారా వెన్నుపోటు పొడవాలనుకొని హైదరాబాద్ నుండే తరిమికొట్టబడ్డాడు.

2014-2019 చంద్రబాబు నాయుడు పాలనలో 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, పరిహారం మాత్రం 391 మంది రైతులకు మాత్రమే ఇవ్వడం విచారకరం.
జగన్ ప్రభుత్వం మిగిలిన అందరికీ కూడా రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశించారు

జూలై 12న బడ్జెట్ ప్రవేశపెట్టి నవరత్నాలకు జీవం పోశాడు.
ఇదే అసెంబ్లీ సెషన్‌లో జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఎస్‌సి, ఎస్‌టి, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అటు వర్క్స్‌లోను, నామినేటెడ్ పదవుల్లోను బిల్ తీసుకొచ్చి శభాష్ అనిపించుకొన్నారు. మహిళలకు కూడా 50 శాతం నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా బిల్ తెచ్చారు. మహిళలకు బహుమతిగా మద్య నియంత్రణ బిల్లు కూడా తీసుకురావడం సంతోషించతగ్గ విషయం.

జగన్ స్వంత ఖర్చులతో వ్యక్తిగత పర్యటనగా ఇజ్రాయిల్, అమెరికా దేశాలకు వెళ్లినా అక్కడ కూడా రాష్ట్భ్రావృద్ధి కోసం చర్చలు జరపడం ముదావహం.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు సెప్టెంబర్ నుండి 1150 కోట్ల రూపాయలు విడుదల చేయడం వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపడమే.

ఏది ఏమైనా ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావులేకుండా సుపరిపాలన అందిస్తూ జగన్ పరుగు కొనసాగుతూ వుంది.

ఒకేసారి 4.1 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టి సెప్టెంబర్ 1నుండి రాష్టమ్రంతటా పరీక్షలు నిర్వహించడం నిరుద్యోగ యువతకు సంబరమే. భారతదేశ చరిత్రలో ఇదో రికార్డు. కనీవినీ ఎరుగని నిజం. పిల్లలంతా పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరి పరీక్షలు రాయడం కన్నులపండుగగా అన్పించింది. ఒక్క ఆరోపణ కూడా లేకుండా చక్కగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

జగన్ తన పరుగులో కొన్ని విషయాల్ని మరచిపోతున్నారేమో అన్పిస్తోంది. రాష్ట్ర ఖజానా డొల్లబోయింది. ఉన్న నాలుగు కాసులూ చంద్రబాబు ప్రభుత్వం చీపుర్లతో ఊడ్చేసి పసుపు-కుంకుమ, రైతు బంధు పథకాలకు ధారపోసింది.

మరోవైపు రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే మద్యం అమ్మకాలపై గొడ్డలివేటు వేశారు. ఇది చాలా సాహసోపేతమైన, కఠినమైన నిర్ణయం. సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎవరైనా ఆహ్వానించాల్సిందే. నాకింకా గుర్తు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్య నిషేధం అని ఓ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ పెట్టి అక్కడ లారీలకొద్ది మద్యం బాటిళ్ళను బుల్‌డోజర్లతో తొక్కించారు. కానీ అది చివరికి స్వప్నంలా ఫొటోషూట్‌లా మిగిలింది. మరి జగన్ నిర్ణయం అలా కాకూడదనే అందరం ఆశిద్దాం.

మరి రెవెన్యూ లోటు కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలేమిటో కనిపించడంలేదు. రాష్ట్ర ఆర్థిక మేధావులను సమావేశపరిచి సలహాలు స్వీకరిస్తే మంచిది. రోడ్ మాప్ స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం వుంది.

పోలవరం రివర్స్ టెండరింగ్‌కెళ్ళి తిరిగి టెండర్లు పిలవడం చాలా మంచిదే. కానీ దీనిపై కోర్టు స్టే ఇవ్వడం విచారకరం.

వీలైనంత త్వరగా, వర్షాకాలం పూర్తయ్యేసరికి అన్ని అడ్డంకులు తొలగించుకొని పనులు మళ్ళీ ఆరంభించాలి.

కేంద్రం జగన్‌కు ఈ విషయంలో సహకరించకపోవడం కూడా చాలా అన్యాయం. అవినీతిని వెలికితీస్తామంటే ఎందుకు అడ్డుపడుతుందో అందరిలో ఆ పార్టీపై అనుమానాలొస్తున్నాయి. నవయుగ కంపెనీపై తెలుగుదేశం, బీజేపీ రెండు పార్టీలు అవ్యాజ్యమైన ప్రేమను చూపడం కూడా విమర్శలకు గురవుతున్నది. జగన్‌గారు వాయువేగంతో ఈ సమస్య పరిష్కారానికి కృషిసల్పాలి.

జగన్‌గారు అద్వితీయమైన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా, అవి సరిగా ప్రజలకు చేరువచేసే యంత్రాంగం వారి దగ్గర వున్నట్లు కనపడడం లేదు. ప్రసార మాధ్యమాలపై రోజువారి సమీక్ష చేసుకోవడం, తప్పులుంటే సరిదిద్దుకోవడం చాలా అవసరం.

మంత్రుల్లో మరింత దూకుడుతనం చలాకీతనం అవసరం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణగార్ల లాగా అందరూ చురుగ్గా యాక్ట్ చేయాలి.

అదే విధంగా వైసీపీ స్పోక్స్ పర్సన్స్‌లో కూడా కొంత ఎనర్జీ నింపాల్సి వుంది. ఒక్కోసారి చర్చల్లో టీడీపీ వారితో ఢీకొనలేక పోతున్నారు. అందరూ జగన్ పరుగు అందుకోవాలి.

ఖజానా ఖాళీగా వుంటే సీఎం ఏంటి రోజుకో వరాన్ని కురిపిస్తున్నారు? డబ్బులెక్కడివి? అని అందరిలా నాకు డౌట్ వచ్చి పనిగట్టుకొని విజయవాడకెళ్ళి సీఎంవోలోని ఓ అధికారిని కలిసి చర్చించడం జరిగింది. ఆయన వివరణ నాకు తృప్తినిచ్చింది.

ఎన్నికల ముందు మోడీగారిని తిట్టిన తిట్టు తిట్టకుండా చంద్రబాబు విమర్శించారు. కేజ్రీవాల్, దేవెగౌడ, మమతాబెనర్జీ, మాయావతి తదితరులందరినీ కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ఎంత తపన పడ్డారు. మరి ఇప్పుడెందుకో చంద్రబాబుగారు మోదీ గురించి మాట్లాడడం లేదు?

తన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళినా, జీడీపీ రేటు తగ్గినా పల్లెత్తు మాటలు మాట్లాడడం లేదు.

అసెంబ్లీలో అయితే మోదీ విదేశీ పర్యటనల్ని కూడా సమర్ధించారు.

అంతా బాగానే వుంది. ఇంకా ఎన్నికలు చాలా దూరంలో వున్నాయి. అయినా బాబుగారు రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడిని ఎందుకు పుట్టిస్తున్నారో? జూన్ 13నుండి అనగా ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి తమ్మినేని సీతారాం ప్రమాణ స్వీకారంచేసిన నాటినుండి చంద్రబాబుగారు జగన్ పాలనపై విల్లంభులు సంధిస్తూనే వున్నాడు.

అదయ్యాక సెక్యూరిటీ విషయంలో ఎంత డ్రామానో!
2003లో ఎప్పుడో నక్సలైట్లు హత్యాయత్నం చేశారని చంద్రబాబుకు జడ్ క్యాటగిరి సెక్యూరిటీని కల్పించారు. ఇది జరిగి 15 సం.లు దాటుతున్నా కేంద్రం ఇది కొనసాగిస్తూనే వుంది. మరి రాష్ట్రం తన సెక్యూరిటీ తగ్గించిందంటూ కోర్టుకెళ్ళడంలో ఏం సాధించారు? ఎందుకెళ్ళాల్సొచ్చింది. ఇంత వయస్సులో మీకింకా అంత సెక్యూరిటీ కావాల్సిందేనా? మీరెందుకు భయపడుతున్నారు?

జూన్ 25వ రాత్రి జగన్‌గారు చెప్పినట్లుగానే అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను తొలగించడం జరిగింది. క్రొత్త ప్రభుత్వం కనుక అక్రమ కట్టడాలపై ఓ నిర్ణయం తీసుకొంది. అందులో తప్పేముంది? చంద్రబాబు పార్టీ దానిని అంతర్జాతీయ సమస్యలా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. దీనికి కథ, మాటలు, డైరెక్షన్ అన్నీ చంద్రబాబే కావడం దురదృష్టకరం. అద్దె ఇల్లుపై కూడా చంద్రబాబు, ఆయన పార్టీ ఆడిన డ్రామా నవ్వులపాలైంది.

జూన్ 26వ తారీఖున విద్యుత్ కొనుగోలు ఒప్పందాలవల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని 2,636 కోట్ల రూ.లు ఆ సంస్థలనుండి రికవరీ చేయాలని జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా చంద్రబాబు హుందాగా స్వీకరించి, నిజానికి రాష్ట్రానికి మంచి జరిగితే అంతకన్నా ఏం కావాలని సైలెంటుగా వుండిపోయుంటే ఎంతో బాగుండేది!

గుంటూరు జిల్లాలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చేందుకు తెలుగుదేశం నాయకులంతా జూలై 1న పార్టీ ఆఫీసుకెళ్ళి కలిశారు. చంద్రబాబు వారి సమస్యను ప్రక్కనపెట్టి రాష్టమ్రంతటా తెలుగుదేశం కార్యకర్తలపై హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఓ ధర్మోపదేశం ఇచ్చి పంపేశారు.

మరుసటి రోజు పచ్చ మీడియాలో ఆ అంశంపోయి ఈ అంశం పతాకస్థాయిలో రావడంతో గుంటూరు జిల్లా పచ్చ నేతలు ముక్కుపై వ్రేలేసుకొన్నారు.

మీరు ఆ సమస్యను ఎన్నుకొని ప్రభుత్వంపై దాడి చేయాలనుకొన్నారు. దానినే అంశంగా మీ రెండురోజుల కుప్పం పర్యటన ప్రచారం సాగింది. అందుకు బదులుగా మీకు కుప్పం నియోజకవర్గంలో గణనీయంగా ఓట్లు ఎందుకు తగ్గాయో అనే్వషించాల్సింది. మీ శాసనసభ్యులు కూడా జూలై 1న ఇదే అంశంపై డీజీపీని కలిసి కంప్లయింట్ ఇచ్చారు.

విండ్ పవర్ కొనుగోలు రేట్లపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మీరు మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగేకొద్దీ విండ్ పవర్ ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. మరి జగన్ మాట్లాడుతూ రానురాను ధరలు తగ్గితే ఆ సంస్థలతో 25 సం.కాలానికి ఎందుకు అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది అని అడిగారు.

జగన్ పరిపాలన చూసి ప్రపంచ బ్యాంకు రుణాలు వెనక్కి తీసుకొంది అని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ట్వీట్ చేసి, అది అబద్ధం అని తేలి ఎంతో పరువు తీసుకొన్నారు.

జగన్‌పై కోపముంటే వుండచ్చు గానీ మరీ ఇంతలానా? ముందు, వెనుక చూసుకోకుండా తొందరపడితే అనర్థాలే జరుగుతాయి. చంద్రబాబుకెందుకంత ఆక్రోశం?

స్థానికులకు 75 శాతం వుద్యోగాలని జగన్ ప్రకటించడం కూడా చంద్రబాబుకు ఎందుకో మింగుడు పడలేదు. మనమిచ్చే భూములు, మనం కల్పించే వౌలిక వసతులు కల్పించే సంస్థల్ని మన పిల్లలకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కోరడంలో తప్పేంటి? మన పిల్లలు చాలా మేధావులు. ఇక్కడ వుద్యోగాలు దొరక్క దేశ దేశాల్లో పనిచేస్తున్నారు. అంతమాత్రాన చంద్రబాబుగారు జగన్ పాలన రాష్ట్రానికి పట్టిన శని అని, తుగ్లక్ పాలన అని పేర్కొనడం ఎంతవరకు సబబు?

కృష్ణా కరకట్టలకు వరద ముంపురావడం చంద్రబాబు హైద్రాబాద్‌కెళ్ళిపోవడం జరిగాయి. వరదల లెవెల్స్‌ను తెలుసుకొనేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్‌ను ప్రయోగిస్తే పసుపు పార్టీ ఎంత రాద్ధాంతం చేసింది?
చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు, ఆ పచ్చ పత్రికలు చంద్రబాబుపై హత్యాప్రయత్నంలా రాయడం ఎంత సిగ్గుచేటు.

ప్రవాహంలో కొట్టుకొంటూ వచ్చి, అడ్డుతగిలి ఓ చిన్న బోటు నదిలో ఆగిపోతే తండ్రి, కొడుకులు దానిని వైసీపీవారు తమ అద్దె ఇల్లు కూల్చేందుకు ప్రయత్నించారని ఎంత అబద్ధాలకు పూనుకొన్నారు.

100 రోజుల్ని సమీక్షిస్తే ప్రతిపక్ష నేత తప్పులే ఎక్కువగా కన్పిస్తాయి. అది దురదృష్టం.

నవయుగ సంస్థ టెండర్స్ క్యాన్సిల్ చేయడం, లింగమనేని గెస్ట్‌హౌస్ అక్రమ కట్టడం అని, నోటీసులిస్తే వారికన్నా చంద్రబాబే ఎక్కువ బాధపడ్డారు. ఎందుకో?

సెప్టెంబర్ 3వ తారీఖున గుంటూరులో టీడీపీ ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో చంద్రబాబు చేసిన ప్రసంగం ఆయన పైత్యాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్ళాయి. జగన్‌పై ఆయన వాడిన భాష వ్రాయడానికి కూడా మనస్కరించదు. సంస్కారులెవరూ అలా మాట్లాడరు. కార్యకర్తల్ని చంపేస్తున్నారంటూ చంద్రబాబు గుంటూరులో వీరావేశంతో ప్రసంగించారు.

జగన్ 100 రోజుల పరుగుల ఆఖర్నకూడా అనేక వరాల్ని కురిపించాడు. ఇచ్చిన వాగ్దానాల్ని అమలుచేశాడు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ప్రకటించారు. సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయాలు తీసుకొన్నారు. తిత్లీ బాధితుల నష్టపరిహారం డబుల్ చేశారు. జగన్ పాలనను మనం ఏడాది తర్వాత సమీక్షించుకొందాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *